గోడు చెప్పుకోవడానికొచ్చి.. ఉసురు తీసుకోబోయారు

10 May, 2022 02:00 IST|Sakshi

వేర్వేరు చోట్ల ప్రజావాణిలో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌)/వరంగల్‌: నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలకలం చెలరేగింది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌లో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు ఈ అఘాయిత్యానికి యత్నించగా అధికారులు, పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఓ మహిళ ఫినాయిల్‌ తాగగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. 

లైంగికంగా వేధిస్తున్నారని..
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌కు చెందిన నాగలక్ష్మి తన కూతురితో కలసి కలెక్టరేట్‌కు వచ్చింది. నామ్‌దేవ్, ఎర్రం గణపతి అనే వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసుకుంది. వెంట తెచ్చుకున్న ఫినాయిల్‌ తాగేసింది. భర్త లేని తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు ఆశచూపినా లొంగకపోవడంతో మంత్రాలు చేస్తున్నానని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నాగలక్ష్మిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వేధించినవారిని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. 

భూమిని కబ్జా చేశారని..
ప్రభుత్వం తనకు ఇచ్చిన మూడెకరాల వ్యవసాయ భూ మిని కబ్జా చేసిన పెద్దోళ్ల గంగారెడ్డిపై అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మేకల చిన్న చిన్నయ్య అనే దళిత రై తు నిజామాబాద్‌ ప్రజావాణికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు.

గంగారెడ్డి గతేడాది జూన్‌లో తన భూమిని ఆక్రమించి దున్నాడని, ప్రశ్నించినందుకు చం పుతానని బెదిరిస్తున్నాడని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చిన్నయ్యను పోలీసులు కలెక ్టర్‌ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. 

భాగస్వాములు మోసం చేశారని.. 
వరంగల్‌ నగరానికి చెందిన జిన్నింగ్‌ మిల్స్‌ వ్యాపారి రఘునందన్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. తన వ్యాపార భాగస్వాములు లెక్కల్లో మోసం చేసి కేవలం రూ.40 లక్షల వరకు బకాయి పడినట్లు చూపుతున్నారని కలెక్టర్‌కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఆ వెంటనే పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతోనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఇది ప్రైవేటు సమస్య అయినందున సీపీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. తర్వాత సుబేదారి పోలీసులు రఘునందన్‌ను బయటకు తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు