మిల్లర్లతో సర్కారు కుమ్మక్కు

10 Apr, 2022 02:23 IST|Sakshi

కేసీఆర్‌ కుటుంబంపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలి: మధుయాష్కీ 

సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం సేకరణలో రాష్ట్రం లోని మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జేబులను కొల్లగొడుతోందని, రూ. వేల కోట్లను దోచుకుంటోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం లో రైతుల నుంచి ఎంఎస్‌పీ కంటే సుమారు రూ.400 నుంచి రూ.600 తక్కువకే మిల్లర్లు ధాన్యం కొంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

ఇలాంటి అక్రమాలపై విజిలెన్స్‌ దాడులు చేయించకపోవడం, క్రిమినల్‌ కేసులను పెట్టకపోవడాన్ని బట్టి మిల్లర్లతో సర్కారు కుమ్మక్కైనట్లు అర్థమవుతోందన్నారు. శనివారం తెలంగాణభవన్‌లో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న సీఎం.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రధాని మోదీ, మంత్రులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు.

కేంద్రం ధాన్యం సేకరించకపోతే తామే కొంటామని ఢిల్లీ ధర్నాలో కేసీఆర్‌ ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ధర్మపోరాటం పేరుతో ఢిల్లీలో దీక్ష చేస్తే ఏం జరిగిందో తెలుసుకుంటే మం చిదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. రైస్‌ మిల్లర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేలా పెద్ద కుంభకోణం జరుగుతోందని, రాష్ట్రంలో ధా న్యం సేకరణను ప్రారంభించకపోతే ఈ నెల 15 నుంచి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.    

మరిన్ని వార్తలు