దళితబంధుకి ప్రత్యేక  పోర్టల్‌.. యాప్‌

26 Jul, 2021 03:46 IST|Sakshi

ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ.. పరిశీలన

దళితబంధు పథకం మార్గదర్శకాలు ఖరారు

పోర్టల్, యాప్‌ ద్వారా పథకం అమలు తీరు పర్యవేక్షణ

రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్న ఎస్సీ అభివృద్ధి శాఖ

వచ్చే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి వచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖ వీటిని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశంఉన్నట్లు ఆ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఆగస్టు మొదటి లేదా రెండో వారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
దళిత బంధు పథకం దరఖాస్తుల స్వీకరణ మొదలు పరిశీలన, అర్హత నిర్ధారణ, ఆర్థిక సాయం అందజేత తదితర ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే కొనసాగనుంది. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. దీనికి సమాంతరంగా యాప్‌ను కూడా తయారు చేసింది. ప్రస్తుతం ఇవి ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారం నాటికి వెబ్‌ పోర్టల్‌తో పాటు యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి అధికారులు మొదలు జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు అంతా ఈ వెబ్‌ పోర్టల్, యాప్‌ ద్వారా నిరంతరం పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సీజీజీ కేటాయిస్తుంది. 

నెలరోజుల కసరత్తు
దాదాపు నెలరోజుల పాటు కసరత్తు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకుని విధివిధానాలను రూపొందించారు. ఈ పథకం కింద అర్హత సాధించిన కుటుంబానికి గరిష్టంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారు వ్యక్తిగత ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విదేశీ విద్యా నిధి పథకంలో గరిష్ట లబ్ధి రూ.20 లక్షలు కాగా.. దాని తర్వాత దళిత బంధు పథకం కిందే అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందనుంది. 

ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబానికి ప్రాధాన్యత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందని కుటుంబానికి ఈ పథకంలో తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న, భూమి లేని పేద కుటుంబాన్ని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరిట పథకం మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో అర్హురాలైన మహిళ లేనప్పుడు పురుషుడికి అవకాశం కల్పిస్తారు. 

ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దరఖాస్తుదారులు తాము ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును పక్కాగా సమర్పించాలి. అన్ని కోణాల్లో వడపోసిన తర్వాతే ఎస్సీ కార్పొరేషన్‌ అర్హతను ఖరారు చేస్తుంది.

మరిన్ని వార్తలు