సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ

26 Nov, 2020 14:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్‌ ఎన్నికలను ఆసరాగా తీసుకుని హైదరాబాద్‌లో మత ఘర్షణలు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. చదవండి: గ్రేటర్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకా

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్‌‌  చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ  ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలందరూ పోలీసులతో భాగస్వామ్యం కావాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశామని, ముందస్తుగా ఉన్న సమాచారం మేరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసకున్నామన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు