కంట్రోల్‌లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్‌

21 Apr, 2022 16:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా..  జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. 

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారాయన. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపారాయన.

థర్డ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫోర్త్‌వేవ్‌పై అనేక సందేహాలున్నాయి. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉంది. ఫోర్త్‌ వేవ్‌ రాబోదని ఎన్‌ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయి. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అలాగని కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు. 

రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయి. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్‌లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్ లు ధరించాలి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచిస్తున్నాం అని తెలిపారు డీహెచ్‌.

చదవండి: భారత్‌లో వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల

మరిన్ని వార్తలు