పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

27 Jun, 2022 02:28 IST|Sakshi
బోడ జనార్దన్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న రేవంత్‌రెడ్డి 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్, ఇతర నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్‌.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రవేశపె ట్టి ప్రజల మన్ననలు పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌కు సేవలందించారని కొనియాడారు.

మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్‌ బీఎస్‌పీ నాయకుడు రావి శ్రీనివాస్, మెట్‌పల్లి జెడ్పీటీసీ కె.రాధ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కళ్లెం శంకర్‌రెడ్డి తదితరులు ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్, మే లో ఎన్నికలు ఉంటాయని, జూన్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

మాజీ మంత్రి బోడ జనార్దన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి ఒక్కరేనని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌.. ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు రవి, వేంనరేందర్‌ రెడ్డి, మెట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు