బ్రెయిన్‌ స్ట్రోక్‌పై అవగాహన కల్పించాలి

30 Oct, 2021 01:35 IST|Sakshi
బైప్లేస్‌ క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న గవర్నర్‌

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): ప్రజలకు గుండెపోటుపై ఉన్న అవగాహన బ్రెయిన్‌ స్ట్రోక్‌పై లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. అందువల్ల దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె వైద్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బైప్లేస్‌ క్యాథ్‌ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించడం చాలా కష్టమని చెప్పారు.

అవగాహన లోపించడంతోనే ఆస్పత్రికి తీసుకుని రావాల్సిన గోల్డెన్‌ అవర్స్‌లో రాలేక శాశ్వత అంగవైకల్యంతోపాటు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి ఈ ఆధునిక బైప్లేస్‌ న్యూరో ఆంజియో ప్రొసీజర్‌ సూట్‌తో ఒకే మిషన్‌పై స్కానింగ్‌ పరీక్షలు, చికిత్స లాంటివి చేయడం వల్ల ఎంతో సమయం ఆదా అవుతుందని చెప్పారు.

యశోద ఆస్పత్రి డైరెక్టర్‌ పవన్‌ గోరుకంటి, సీనియర్‌ న్యూరో ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌ గిరగాని, సీనియర్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆనంద్‌ బాలసుబ్రమణ్యం, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కోమల్‌ కుమార్‌ మాట్లాడుతూ వరల్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా రాష్ట్రంలో మొదటిసారిగా యశోద ఆస్పత్రిలో అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. 

మరిన్ని వార్తలు