వరి సాగుపై ఆంక్షలు వద్దు: ఉత్తమ్‌

28 Oct, 2021 03:16 IST|Sakshi

వరి రైతాంగానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది 

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు తీసుకునే నిర్ణయాల వల్ల రైతులు రోడ్డుపై పడే ప్రమాదముందని, వరి సాగుపై ఆంక్షలు విధించొద్దని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని 70 శాతం మంది రైతులు సాగు చేసే వరి పంట విషయంలో రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. కిసాన్‌సెల్‌ జాతీయ వైస్‌చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణను రైస్‌బౌల్‌ చేస్తానన్న సీఎం, ఇప్పుడు వరి సాగుపై ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. వరి రైతాంగం పక్షాన కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. కిసాన్‌సెల్‌ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను భయపెడుతోందని విమర్శించారు. వరి పంట వేయొద్దని జిల్లా కలెక్టర్‌ ఆదేశించడమేంటని ఆయన ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు