Telangana High Court: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ సరికాదు.. పైగా గడువు ముగిశాక

28 Feb, 2023 01:22 IST|Sakshi

తేల్చిచెప్పిన హైకోర్టు ధర్మాసనం 

గడువు ముగిశాక దరఖాస్తులను పరిశీలించాలని కోరడం సమర్థనీయం కాదు 

ఎల్‌ఆర్‌ఎస్‌ పిటిషనర్లకు స్పష్టీకరణ 

గతంలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌ను తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం 

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ లే–అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయడం అనే ప్రక్రియే తప్పని.. అలాంటిది గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చే­సు­కున్న వాటినీ అనుమతించాలని కోరడం ఏ మా­త్రం సమర్థనీయం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అలా ఎక్కడైనా చేసినట్లు తెలిస్తే ప్రభుత్వ న్యా­య­వాది (జీపీ) దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) పేరిట చేసే క్రమబద్దీకరణే సరికాదని స్పష్టంచేసింది. గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం తమ ఇంటి నిర్మాణానికి అప్లికేషన్లను అనుమతించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు నిర్మల్‌కు చెందిన పలువురు హై­కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  

సింగిల్‌ జడ్జి తీర్పు సమంజసమే.. 
ఈ పిటిషన్లపై తొలుత హైకోర్టు సింగిల్‌ జడ్జి విచా­రణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లందరూ తమ ప్లాట్ల­కు య­జమానులని, విక్రయ డాక్యుమెంట్లు కూడా వా­రి వద్ద ఉన్నాయన్నారు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి కోసం సంబంధిత అధికారు­లకు దరఖాస్తును సమర్పించడానికి యత్నించా­రని వెల్లడించారు.

జీవో ప్రకారం 2022, ఆగస్టు 26 లోపు దరఖాస్తు చేయలేదని తిరస్కరించడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు తమ పిటిషన్‌లో ప్రభుత్వ జీవోను ప్రశ్నించలేదని చెప్పారు. అసలు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయకుండా, ఇంటి నిర్మాణానికి ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు.

జీవోలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదని, ఈ క్రమంలో ప్రతివాదులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ రిట్‌ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో పిటిషనర్లు సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ద్విసభ్య ధర్మాసనం కూడా సింగిల్‌ జడ్జి ఆదేశాలను సమర్థించింది.  
 
గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు 
ప్రభుత్వం 2020లో అనధికారిక ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 131ని తెచ్చింది. దీన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు వెలువడ్డాక విచారణ చేపడతామని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అప్పటివరకు బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లపై స్టే యథావిధిగా కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం గతంలో వెల్లడించింది.

అప్పటివరకు అర్జీదారులను ఇబ్బందులకు గురి చేయకూడదని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉంది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటి?’అని ఘాటుగా వ్యాఖ్యానించింది.   

మరిన్ని వార్తలు