తుపాకులు అన్‌లాక్‌ ఎందుకు చేశారు? 

3 Jan, 2023 01:05 IST|Sakshi

‘దిశ’ఎన్‌కౌంటర్‌ కేసులో పిటిషనర్ల న్యాయవాది వాదనలు  

పోలీసులు అన్‌లాక్‌ చేయడం అనుమానాస్పదం 

సంకెళ్లు ఎందుకు తీసారో చెప్పలేదన్న న్యాయవాది

సాక్షి, హైదరాబాద్‌:  ‘ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు తుపాకులను ఎలా అన్‌లాక్‌ చేశారు?.. ఒకవేళ పోలీసులే అన్‌లాక్‌ చేస్తే.. ఎందుకు చేశారో చెప్పడం లేదు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పిన పోలీసులు వారికి సంకెళ్లు ఎందుకు వేయలేదు. ఇలాంటి వన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి’అని ‘దిశ’ఎన్‌కౌంటర్‌ కేసులో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ సుదీర్ఘ వాదనలు వినిపించారు. 2019, డిసెంబర్‌ 6న జరిగిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాం జీ ధర్మాసనం సోమ వారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘2019, నవంబర్‌ 27న చటాన్‌పల్లి వద్ద ఓ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. 28న ఉదయం బాధితురాలి మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. కొద్ది రోజుల్లోనే నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

డిసెంబర్‌ 6న ఘటనాస్థలికి వారిని తీసుకెళ్లిన పోలీసులు.. నిందితులు తమపై దాడికి యత్నించారని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెబుతున్నారు. 10 మంది సీనియర్‌ అధికారులు ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉన్నారని చెబుతున్నా.. నిందితులను ఎక్కడ కాల్చారో కూడా చెప్పలేకపోయారు. ఈ 10 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికలో పేర్కొంది.

ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కేసు వివరాలను నిందితుల తల్లిదండ్రులకు చెప్పకుండా.. క్రమంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. కావాలనే మీడియాకు లీకులు ఇవ్వడంతో పాటు 2019లో నవంబర్‌ 29, డిసెంబర్‌ 6న ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ఇచ్చారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలోని మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోకముందే సీపీ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

ఇది తాము సత్వర న్యాయం అందించామని ప్రజ లకు చెప్పడం కోసమే ఏర్పాటు చేసినట్లు ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా సీపీ వ్యాఖ్యానించారు. సిట్‌ కూడా దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించాకే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతుండగా, లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నిందితుల్లో ఇద్దరిని ఫుటేజీలో చూడలేదని చెప్పారు.

నిందితుల్లో జోలు నవీన్‌ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. స్కూల్‌ రికార్డుల ప్రకారం నిందితుల్లో ముగ్గురు మైనర్లే అయినా.. జువెనైల్‌ చట్టప్రకారం దర్యాప్తు చేయలేదు. ఈ కేసును ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో కోర్టు పర్య వేక్షణలో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయి’అని వృందా నివేదించారు. కాగా, ప్రభు త్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 23కు వాయిదా వేసింది.     

మరిన్ని వార్తలు