ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ

17 Oct, 2022 01:50 IST|Sakshi

ముగిసిన జోసా కౌన్సెలింగ్‌

ఎన్‌ఐటీలకు ప్రత్యేకంగా..

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది.  విద్యార్థులు వ్యక్తిగత లాగిన్‌ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది.

ఈ ఏడాది జేఈఈ  మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు.

ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్‌ సీట్లు 
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌ఐటీల్లో 54477 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్‌ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్‌ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్‌ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్‌ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్‌ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. 

మరిన్ని వార్తలు