ఉక్కు హామీకి తుప్పు పట్టిందా..!

21 Feb, 2022 02:58 IST|Sakshi

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రసాద్‌సింగ్‌కు కేటీఆర్‌ ఘాటు లేఖ  

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం కావాలనే పక్కనపెడుతోంది 

రాజ్యాంగబద్ధంగా దక్కిన హామీని తుంగలో తొక్కుతోంది 

ప్లాంట్‌ ఏర్పాటులో భాగమవుతామన్నా స్పందించట్లేదు 

కిషన్‌ రెడ్డి ‘తుక్కు సంకల్ప’ మాటల అంతరార్థమేంటని ఫైర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం హామీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నిండు పార్లమెంట్‌లో ఒప్పుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీ ప్రకారం ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని గుర్తు చేశారు.

ఉక్కు కర్మాగారం విష యంలో కేంద్రం వైఖరిని ఎండగడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌కు కేటీఆర్‌ ఆదివారం లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఉసురు తీసిన కేంద్రం.. బయ్యారంలో మొదలుకాకుండానే ఉక్కును తుప్పుగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్లాంట్‌ ఏర్పాటులో తాము భాగమవుతామన్నా స్పందించట్లేదని మండిపడ్డారు.  

పీఎంకు, కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా.. 
దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో 11 శాతం బయ్యారంలోనే ఉన్నాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. సుమారు 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న ‘జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)’సర్వే నివేదికను ప్రస్తావిస్తూ నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ బయ్యారంలో లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. బయ్యారంలో లేకపోతే అక్కడి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లాలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్‌ ఓర్‌ రవాణాకు ఓ స్లర్రి పైపులైన్‌ లేదా రైల్వే లైన్‌ వేస్తే సరిపోతుందని ప్రధాని మోదీని కలిసి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఖనిజ రవాణా వ్యయంలో భాగమయ్యేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్టు హమీ ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తానూ పలు మార్లు కేంద్ర మంత్రులను కలసి ప్లాంట్‌ కోసం ప్రయత్నం చేసినా స్పందన రాలేదని విమర్శించారు. 

పెల్లెటైజేషన్‌ ప్లాంటైనా పెట్టాలని కోరాం  
ఛత్తీస్‌గఢ్‌ నుంచి బయ్యారం ప్లాంట్‌కు ఐరన్‌ ఓర్‌ సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్‌ఎండీసీ అంగీకరించిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ (మేకాన్‌) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్‌ ప్లాంట్, స్క్రాప్‌ బేస్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్‌ఎండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా ఉన్నా కేంద్రం మాత్రం ప్లాంట్‌ ఏర్పాటును పక్కనబెడుతోందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రస్తుతం వీలు కాకుంటే తాత్కాలికంగా పెల్లెటైజేషన్‌ ప్లాంట్‌ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరామన్నారు.  

కిషన్‌రెడ్డి.. ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదంటారా?  
ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రానిది ‘తుక్కు సంకల్పమే’నని తేలిపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. స్టీల్‌ ఫ్యాక్టరీని సాధించాల్సిన కేంద్ర మంత్రే ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదని చేతులేత్తేయడం సిగ్గుచేటన్నారు. కిషన్‌ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌తో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేలాది మంది గిరిజన, అదివాసీ యువకుల ఆశలకు కిషన్‌రెడ్డి ఉరేశారని విమర్శించారు.  

సెయిల్‌ ఆధ్వర్యంలోని పాత ప్లాంట్లకు రూ. 71వేల కోట్లు 
‘బయ్యారం ప్లాంట్‌ గురించి పట్టించుకోని కేంద్రం.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్‌పూర్, దుర్గాపూర్‌ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు రూ. 71 వేల కోట్లను ఖర్చు చేసింది. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా.. రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక సెయిల్‌ను అప్పనంగా అమ్మేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని కేటీఆర్‌ ఆరోపించారు.   

మరిన్ని వార్తలు