Vidya Volunteer: విద్యా వలంటీర్‌ది దౌర్భాగ్య పరిస్థితి..

2 Oct, 2021 12:39 IST|Sakshi
Vidya Volunteer: మేస్త్రీ పని చేస్తున్న వరలక్ష్మి

పాఠశాలలు ప్రారంభమైనా పునరుద్ధరణకు నోచుకోని విద్యావలంటీర్లు

ఉమ్మడి జిల్లాలో 1,529 మంది అవస్థలు

2019లో అందని నాలుగు నెలల వేతనాలు

పొట్టకూటి కోసం కూలీలుగా మారిన వైనం

ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్‌ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్‌ చేయాలని వేడుకుంది.

నర్సంపేట రూరల్‌: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్‌ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు

కరోనా కాలంలో ప్రైవేట్‌ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్‌ 44, జనగామ 120, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్‌ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్‌ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు.
చదవండి: తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు

పట్టించుకోలేదని ఆవేదన..
2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు