పోరాటాలు, యాత్రలపై దృష్టి!

16 Apr, 2022 03:05 IST|Sakshi

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, వ్యూహాలపై కాంగ్రెస్‌ కీలక భేటీలు 

టీపీసీసీ ముఖ్య నేతలతో సమావేశమైన మాణిక్యం ఠాగూర్‌ 

నేడు పీఏసీ సభ్యులు, సీనియర్‌ నేతలతో భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలు వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీల్లో రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు, పార్టీ నేతల యాత్రలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇందులోభాగంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాణిక్యం ఠాగూర్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ తదితరులు హాజరయ్యారు.

సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం, రాహుల్‌ పర్యటనపై రెండున్నర గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ సభ్యులుగా చేరిన 40లక్షల మందికి పైగా కార్యకర్తలకు బీమా అందేలా చూడాలని, ఇందుకోసం గాంధీభవన్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులతో శనివారం సమావేశాలు నిర్వహించనున్నారు.  

6, 7 తేదీల్లో రాష్ట్రానికి రాహుల్‌ 
వచ్చే నెల 6,7 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ రెండు తేదీల్లో ఆయన టూర్‌ దాదాపు ఖరారు కాగా, ఆయా తేదీలను నేడు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. రాహుల్‌ తన పర్యటనలో వరంగల్‌ రైతు బహిరంగసభలో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కుత్బుల్లాపూర్‌ లేదా ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

మరిన్ని వార్తలు