గీతకార్మికులకు మోపెడ్లు

30 Nov, 2022 01:31 IST|Sakshi

అంగవైకల్యం సర్టిఫికెట్ల జారీ సులభతరం.. సాధారణ మరణానికి కూడా ఎక్స్‌గ్రేషియా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యకారుల తరహాలో గీతకార్మికులకు కూడా మోపెడ్లు ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, ఇందుకు అవసరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నీరాపాలసీలో భాగంగా నీరాకేఫ్‌ ప్రారంభోత్సవం, ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, నీరా చిల్లింగ్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఎక్సైజ్‌శాఖ పరిధిలోని పలు అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ గీతకార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎక్సైజ్‌ శాఖ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. వృత్తి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు గీతకార్మికులు చెట్లపై నుంచి కింద పడినప్పుడు సంభవించే శాశ్వత అంగవైకల్యానికి ఇచ్చే సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని, ఆర్థోపెడిక్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఈ సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనలు సవరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో మెడికల్‌ బోర్డు పేరిట ముగ్గురు డాక్టర్లు సంబంధిత సర్టిఫికెట్‌ ఇచ్చే ప్రక్రియలో భాగస్వాములయ్యేవారు. సాధారణ మరణాలకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు.  

10 రోజుల్లో సీఎం చేతుల మీదుగా నీరాకేఫ్‌ ప్రారంభం 
ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గీతకార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నీరాపా­లసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పా­రు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో రూ.20 కోట్లతో నిర్మించిన నీరాకేఫ్‌ను సీఎం కేసీఆర్‌ పదిరోజుల్లో ప్రారంభించేందుకు వీలుగా పనులు పూర్తి చేయా­లని అధికారులను ఆదేశించారు. సర్వేల్, చారుకొండ, మునిపల్లెల్లో చిల్లింగ్‌ ప్లాంట్ల నిర్మాణపనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ఆ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌­రా­వు, డేవిడ్‌ రవికాంత్, దత్తురాజ్‌ గౌడ్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీంద­ర్‌­రావు, అరుణ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌గౌడ్, నవీన్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు