వ్యవసాయ శాఖలో అలజడి

11 Jan, 2023 01:53 IST|Sakshi
డైరీ ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

ఉన్నతాధికారుల వివక్షపై ఉద్యోగుల అసంతృప్తి

డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డిని పిలవని ఒక సంఘం

అదే సభకు మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరుతో రచ్చ

వేధింపులకు భయపడొద్దని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ భరోసా

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు.

అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. 

వివక్ష.. వేధింపుల వల్లే?
వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ కీలక మైంది. ఈ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగింది. దీనికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హాజరయ్యారు.

సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. 

విజిలెన్స్‌ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు
ఈ సభలో అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్‌ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు.

317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డిని, కార్యదర్శి రఘునందన్‌ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్‌ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు.

అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభయం ఇచ్చారు.

ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్‌ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు