కొండగట్టు ఆలయ అభివృద్ధిలో ‘గ్రీన్‌ ఇండియా’

17 Feb, 2023 02:05 IST|Sakshi

వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోనున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ 

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ దేవాలయంగా పునర్‌ నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి మద్దతుగా ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేïసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తరఫున గురువారం తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు.

స్వరాష్ట్రం సిద్ధించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.  

కొడిమ్యాల అభివృద్ధి ఇలా... 
కొడిమ్యాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వచ్చే కంపార్ట్‌మెంట్‌ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా రూ.కోటి వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని సంతోష్‌ ప్రకటించారు. దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు నాటు తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు.   

మరిన్ని వార్తలు