TS: సచివాలయం కింద చెరువు.. 2.5 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం

19 Jan, 2023 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్‌ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్‌ టాప్‌లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు.

అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్‌ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది.  

వాన నీటిని ఒడిసిపట్టేలా.. 
వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్‌ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్‌యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్‌లుంటాయి.

వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్‌ కంటే సచివాలయం ప్రాంగణం బేస్‌ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు.  

పార్కింగ్‌కు వీలుగా రోడ్డు విస్తరణ 
సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్‌పాత్‌పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్‌లొకేట్‌) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్‌ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్‌ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.   

సౌర వెలుగులు
పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్‌ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్‌టాప్‌లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు.
చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్‌ఎస్‌!

మరిన్ని వార్తలు