రైతు బంధు పక్కదారి!

18 Aug, 2023 01:37 IST|Sakshi

దళారులను పెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారుల మాయాజాలం 

మూడేళ్లుగా లక్షల రూపాయలు స్వాహా 

నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో బయటపడ్డ బాగోతం 

మరిన్ని చోట్లా ఈ తరహా అక్రమాలు! 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. 
సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ను లింక్‌ చేస్తారు.

దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

అక్రమాల్లో కొన్ని.. 

  •  ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చు­కో­­లేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్ర­భుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్‌లైన్‌ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్‌ మార్చే­సిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్‌బ్యాంకులో 39961058007 నంబర్‌ ఖా­తా­లో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పే­రు కిషోర్‌నందయాదవ్‌గా ఉండటం గమనార్హం. 
  •  గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్‌ పోస్టల్‌ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్‌ చేయించుకున్నారు. 
  • ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్‌ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్‌బీఐ ఖాతా (20057909146)ను లింక్‌ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. 
  • ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ 
రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్‌ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు