వాయు‘గండం’: తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

13 Oct, 2020 19:28 IST|Sakshi

వాయుగుండం ప్రభావంతో కుండపోత వానలు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ మంగళవారం రాత్రి తెలిపింది. రేపు మధ్యాహ్నానికి వర్షాలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.


హైదరాబాద్‌ అతలాకుతలం
ఈ సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తూనే ఉంది. శివారు కాలనీలు నీట ముగిగాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. అంబర్‌పేట్ పీఎస్‌లో చెట్టు కూలిపోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

మెట్రో సేవలకు అంతరాయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట- ఎల్బీనగర్‌ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. భారీగా గాలులు వీస్తుండటంతో అక్కడక్కడ కొద్దిసేపు మెట్రో రైళ్లను నిలిపివేశారు. ముసరాంబాగ్‌ స్టేషన్‌లో 10 నిమిషాలు, దిల్‌షుఖ్‌నగర్‌లో 5 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో జనం రోడ్డు మీదకు రావడానికి జంకుతున్నారు.

నల్గొండ జిల్లాలో ఏకధాటిగా వర్షాలు
ఈ ఉదయం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో నల్గొండ ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో వరద నీరు బీభత్సం సృష్టించింది. నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తిప్పర్తి హైవేపై వరద నీరు పొంగిపొర్లుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధర్మారెడ్డి కాలువ పొంగిపొర్లుతోంది. రామన్నపేట మండలం సిరిపురం గ్రామం శివారులోని ఇళ్లకు ముంపు ప్రమాదం పొంచివుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వాయుగుండం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం పడుతుంటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. (ఏ క్షణంలోనైనా హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేత!)

మరిన్ని వార్తలు