అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్‌ బోల్తాపడి..

17 Oct, 2021 04:21 IST|Sakshi

ఖమ్మం జిల్లా బాణాపురం సమీపంలో ఘటన 

ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్‌ కాల్వ వద్దకు బయలుదేరారు.

గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్‌ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్‌లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్‌ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు