బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ..

12 Jul, 2021 01:00 IST|Sakshi
తండ్రి సమాధి పక్కనే తల్లి కోసం తవ్విన గొయ్యి.

గొయ్యి తీసిన కుమారుడు

జీవనభృతి ఇవ్వాలన్నందుకే కొడుకు, కోడలి నిర్వాకం  

యాదాద్రి జిల్లాలో ఘటన

మోత్కూరు: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లిని బతికుండగానే బొంద పెడతానంటూ ఓ కొడుకు గొయ్యి తవ్విన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుచ్చిమల్లయ్య, సాలమ్మ, దంపతులకు ముగ్గురు కుమారులు నర్సింహ, ఐలయ్య, వెంకటయ్యతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం బుచ్చిమల్లయ్య మృతి చెందాడు.

ముగ్గురు కుమారులు కలిపి నెలకు రూ.600 చొప్పున ఆరు నెలలకోసారి 3,600 రూపాయలను జీవనభృతి కింద తల్లికి ఇస్తున్నారు. చిన్నకుమారుడు వెంకటయ్య నాలుగైదేళ్లుగా తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ గత నెల 16న వెంకటయ్య తన భార్యతో కలసి పొలం వద్ద ఉన్న తండ్రి సమాధి పక్కనే బొంద తీశాడు. ఈ విషయమై గ్రామపెద్దలు వెంకటయ్యను తీవ్రంగా మందలించడంతో బొందను పూడ్చివేశాడు. జీవనభృతి ఇవ్వడంలేదని వెంకటయ్యపై తల్లి గత నెల 30న యాదాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు