పండుగ నాటికి 12,000 పోస్టులు

3 Jan, 2023 00:44 IST|Sakshi

ఇక గురుకుల కొలువుల సంబురాలు!

కేటగిరీల వారీగా జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు 

బీసీ గురుకుల సొసైటీలో కొన్ని పోస్టులకు రాని క్లియరెన్స్‌

ఒకట్రెండు రోజుల్లో వాటికి గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ తర్వాత వరుసగా ప్రకటనలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలు వులకు సమయం ఆసన్నమైంది. గత నెల రోజు లుగా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ ఆర్‌బీ) ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక టనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో నాలుగు ప్రధాన నియామక సంస్థలుండగా.. మూడు సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువ డ్డాయి.  

కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9 వేల కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి.

దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావడంలో ఇప్పటివరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది.

పండుగ నాటికి ప్రకటనల జారీ..
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుక బడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది.

 తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులున్నాయి. ఈ పోస్టుల భర్తీకిగాను గురు కుల సొసైటీలు జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి.

బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకు న్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికా రులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటి కల్లా టీఆర్‌ఈఐఆర్‌బీ నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు