అసమ్మతి జోరు..ఆధిపత్య పోరు

1 May, 2022 04:48 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో అక్కడక్కడా తీవ్ర స్థాయిలో అంతర్గత విభేదాలు

కొల్లాపూర్, తాండూరు, ఉమ్మడి ఖమ్మంలో కుమ్ములాట పర్వం

పార్టీలో కొనసాగుతానంటూనే ప్లీనరీకి జూపల్లి దూరం

మాజీ మంత్రి పట్నం, పైలట్‌ నడుమ కొనసాగుతున్న రగడ

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు జరుపుకొని 22వ సంవత్సరంలో అడుగు పెట్టిన టీఆర్‌ఎస్‌ వచ్చే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అక్కడ క్కడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల నడుమ నెలకొన్న అంతర్గత విభేదాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. మరోవైపు ఇటీవలి పార్టీ ప్లీనరీకి పరిమిత సంఖ్యలోనే ఆహ్వానాలు అందడంతో.. ఆహ్వానాలు అందని నేతల్లో అసం తృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధినేత కేసీఆర్‌ స్పందన కోసం..బుజ్జగింపులు, సర్దుబాట్ల కోసం అసంతృప్త నేతలు ఎదురుచూస్తున్నారు.

కొల్లాపూర్‌లో ఇలా..ఖమ్మంలో అలా
కొల్లాపూర్, తాండూరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నేతల నడుమ కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇటీ వల జరిగిన ప్లీనరీ సమావేశాలకు పలువురు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. కొల్లాపూర్‌ నియోజక వర్గంలో తన అనుచరులను ప్లీనరీకి హాజరు కాకుం డా అడ్డుకున్నారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలం క్రితం సీఎం వనపర్తి జిల్లా పర్యటన సందర్భం లోనూ జూపల్లి దూరంగా ఉండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి నడుమ సభలు, అధికారిక సమావేశాల వేదికగా రగడ కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒకటి రెండు మినహా అన్ని చోట్లా పార్టీలో బహుళ నాయకత్వం ఉండటంతో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇక స్టేషన్‌ ఘనపూర్‌ నియో జకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, కడియం శ్రీహరి వర్గాలకు పొసగడం లేదు. 

ఆశలు ఫలించేనా?
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని తమకు గుర్తింపునిస్తారని అసమ్మతి, అసంతృప్త, ఆశావహ నేతలు ఎదురుచూస్తున్నారు. అంతర్గత విభేదాలు ఉన్న చోట పార్టీ అధినేత తమ 
ఇబ్బందిని గమనించి సర్దుబాటు చేస్తారని జూపల్లి లాంటి నేతలు భావిస్తున్నారు. తమ సేవలను గుర్తించి అధికార పదవులు లేదా పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తారని మరికొందరు నేతలు ఆశిస్తున్నారు.  

మమ్మల్ని ప్లీనరీకి పిలవలేదు!
ఇటీవల జరిగిన జరిగిన ప్లీనరీకి తమకు ఆహ్వా నం అందకపోవడంపై పార్టీకి చెందిన పలు వురు సీనియర్‌ నేతలు పరోక్షంగా తమ అసం తృప్తిని వెల్లగక్కుతున్నారు. ఆహ్వానితుల జాబి తాను కేవలం కొందరికే పరిమితం చేయడం ద్వారా తమకు గుర్తింపు లేకుండా చేశారనే ఆవే దన కొందరు ఉద్యమకారులు, అధికారిక పద వులు దక్కని ఇతర నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ శ్రేణుల్లో పలుచన అయ్యేందుకు అవకా శం ఏర్పడిందని ఎమ్మెల్సీ పదవిని ఆశించిన ఓ సీనియర్‌ నేత ‘సాక్షి’తో చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దంపడుతోంది. మరోవైపు.. త్వరలో కొత్త రాష్ట్ర కార్యవర్గం ప్రకటిస్తామని పార్టీ అధినేత 8 నెలల క్రితం చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోకపోవడంపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు