దుబ్బాకపై టీఆర్‌ఎస్‌ కన్ను  

7 Sep, 2020 03:51 IST|Sakshi

దివంగత ఎమ్మెల్యే సోలిపేట కుటుంబానికే టికెట్‌ దక్కే చాన్స్‌ 

అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా అభ్యర్థి ప్రకటన? 

టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశిస్తున్న మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు 

ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టివచ్చిన మంత్రి హరీష్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్‌ మూడోవారంలో ఎన్నికల షెడ్యూలు రావచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్‌ దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  

అసెంబ్లీ వేదికగా అభ్యర్థి ప్రకటన? 
రామలింగారెడ్డి మరణంపై సంతాప తీర్మానంతో ఈ నెల ఏడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు టికెట్‌ను కేటాయించే పక్షంలో అసెంబ్లీ వేదికగానే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ముత్యంరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీని వాస్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

నియోజకవర్గాన్ని చుట్టివచ్చిన హరీశ్‌  
సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది. మంత్రి హరీష్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ, చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కేడర్‌ చెక్కుచెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తుల బుజ్జగింపు, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్‌ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు