23న ‘చలో రామోజీ ఫిలిం సిటీ’: సీపీఎం 

21 Nov, 2022 01:57 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీఎం నేత జాన్‌వెస్లీ  

పట్టాలు ఇచ్చిన పేదలకు ఇళ్లస్థలాలు అప్పగించాలని డిమాండ్‌ 

ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ సమీపంలోని నాగన్‌పల్లిలో 670 మంది పేదలకు మంజూరైన ఇళ్లస్థలాలను వారికి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ గ్రామం నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ తెలిపారు. రాయపోల్‌లో ఆదివారం జరిగిన లబ్ధిదారులు, ఇంటి స్థలాల్లేని పేదల సమావేశంలో ఆయన మాట్లాడారు.

670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆ స్థలాల్లో సినిమా షూటింగ్‌ సెట్టింగ్‌లను ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాసటగా నిలుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు