గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పైలట్‌ ప్రాజెక్ట్‌

30 Jun, 2021 07:52 IST|Sakshi
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి 

ఆ బాధ్యతలను హెల్త్‌ వర్సిటీ తీసుకోవాలి: గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆదిమజాతి గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి హెల్త్‌ వర్సిటీ, ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల బాధ్యత తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. గిరిజనుల్లో ఆరోగ్యం, పోషణ స్థాయిలను పెంచి, ఇతర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని, దీంతో వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఆమె రాజ్‌భవన్‌లో వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, కాళోజీ వైద్య వర్శిటీ, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

ఆదిలాబాద్‌లోని కొల్లంతెగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చెంచు తెగలకు చెందిన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాజ్‌భవన్‌ ఆధ్వర్యంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వివిధ వర్శిటీలు ఆసక్తి చూపాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ పాల్గొని తమ సూచనలు చేశారు.  

గవర్నర్‌ను కలిసిన ఇరాన్‌ దౌత్యవేత్తలు 
హైదరాబాద్‌లో ఇరాన్‌ కాన్సుల్‌ జనరల్‌ మహది షాహ్రోఖి, వైస్‌ కాన్సుల్‌ మీనా హదియన్‌ మంగ ళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

వర్సిటీలకు చాన్స్‌లర్స్‌పురస్కారాలు 
విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చాన్స్‌లర్స్‌ పురస్కారాలు అందజేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ పరిశోధనతో పాటు ఉత్తమ విశ్వవిద్యాలయం విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ఉన్నత విద్యా మండలి ఈ పురస్కారాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తుందని సంస్థ చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.  

>
మరిన్ని వార్తలు