కొత్త సర్కారుకు శ్రీకారం!

5 Dec, 2023 00:59 IST|Sakshi

నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రారంభమైన ప్రక్రియ 

తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాతో గెజిట్‌ ప్రకటన 

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి అందజేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 

రెండో శాసనసభను రద్దుచేస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు 

కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్‌ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ సోమవారం గెజిట్‌ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్‌ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్‌ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్‌ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. 

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు.

రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్‌ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్‌ తమిళిసై, రాజ్‌భవన్‌ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. 

కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. 
కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్‌ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్‌ పక్కనే ఉన్న దిల్‌కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్‌ నుంచి వెనుతిరిగారు. 

కొత్త కొత్తగా సచివాలయం 
నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్‌ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. 

అసెంబ్లీ కూడా ముస్తాబు 
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

తెలంగాణ రెండో శాసనసభ రద్దు 
కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్‌ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ ఉపసంహరణ 
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్‌ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు