జాతీయ స్థాయిలో రెండో స్థానం కైవసం 

15 Jan, 2021 08:10 IST|Sakshi

4,001 కంటే ఎక్కువ బస్సులున్న కేటగిరీలో ఘనత

గతేడాది కంటే 0.12 మేర కేఎంపీఎల్‌ మెరుగుదల

ఏడాదిలో 24 లక్షల లీటర్ల డీజిల్‌ పొదుపు

16న పురస్కారం ప్రదానం చేయనున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్‌ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్‌–2020 సెప్టెంబర్‌ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్‌ పర్‌ లీటర్‌–కేఎంపీఎల్‌) 5.16 ఉండగా, 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. ఏయేటికాయేడు కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆర్టీసీ, జాతీయ స్థాయిలో ఇంధన పొదుపులో ఉత్తమ సంస్థగా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తు వస్తోంది. తాజాగా మరోసారి దాన్ని నిలబెట్టుకుంది. చదవండి: హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం

ఈ మెరుగుదల ఆధారంగా సంవత్సర కాలంలో ఆర్టీసీ 24 లక్షల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేసినట్టయింది. ప్రసుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న డీజిల్‌ ధర ప్రకారం చూస్తే ఈ పొదుపు మొత్తం విలువ దాదాపు రూ.19 కోట్లు అవుతుంది. జనవరి 16న వర్చువల్‌ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పురస్కారంతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని హయత్‌నగర్‌–1, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలు ఇంధన పొదుపులో ఉత్తమ డిపోలుగా నిలిచాయి. కేంద్రమంత్రి ఈ మూడు డిపోలకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నగదు ప్రోత్సాహకం కింద ఒక్కో డిపోకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. చదవండి: సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం 

మరిన్ని వార్తలు