మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు

1 Mar, 2023 20:56 IST|Sakshi

టోర్నీకి ఆతిధ్యం ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కబడ్డీ టోర్నమెంట్‌-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్‌ శివారు హకీంపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్‌ జరుగుతుంది. 

ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్‌ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్‌ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్‌ ముంబై, పుణే మహానగర్‌ పరివాహన్‌, బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. 


 

మరిన్ని వార్తలు