మెట్రో, ఎంఎంటీఎస్‌ రాకపోకలపై కసరత్తు

26 Aug, 2020 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.   

లాంగ్‌ రూట్లకే పరిమితం.. 
ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. హయత్‌నగర్‌– పటాన్‌చెరు, లంగర్‌హౌస్‌– రిసాలాబజార్, ఉప్పల్‌–మెహిదీపట్నం, సికింద్రాబాద్‌– బీహెచ్‌ఈఎల్, జీడిమెట్ల– ఎంజీబీఎస్‌ వంటి కొన్ని రూట్లలో మాత్రమే నడపనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి, కూకట్‌పల్లి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు టికెట్లు ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా ఆర్టీసీలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సెప్టెంబరు 1 నుంచి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కోవిడ్‌ ఉద్ధృతి మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.  ఈ  పరిస్థితుల్లో బస్సులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. 

ఎంఎంటీఎస్‌ లిమిటెడ్‌ సర్వీసులు...  
కేంద్రం అనుమతిస్తే సికింద్రాబాద్‌– లింగంపల్లి రూట్లో మాత్రమే మొదట ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడిచే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువగా హైటెక్‌ సిటీ, లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి రావాల్సివస్తుంది.  వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని  దృష్టిలో కొన్ని సర్వీలను మాత్రమే ఈ రూట్‌కు పరిమితం చేయనున్నారు. కాగా.. ఎంఎంటీఎస్‌ రైళ్లకు కేంద్రం అనుమతిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.  

వచ్చే నెలలో మెట్రో.. 
మెట్రో రైళ్లు వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లిఖిత పూర్వకంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆ తర్వాతే తేదీలను ప్రకటించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు