కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో..

16 May, 2023 07:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్‌: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కరీంనగర్‌ లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కరీంనగర్‌ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ జి.భాస్కర్‌రావులకు అందజేశారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్‌ ఆదేశాలతో కరీంనగర్‌ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

అదే రోజు శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం 
ఈనెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించేలా శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు.

మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, త్వరలోనే వినోద్‌రావు, భాస్కర్‌రావుతో కలిసి తిరుమలకు వెళ్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్‌ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవేంకటేశ్వరసామి ఆలయం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను పరిశీలిస్తామని చెప్పారు.
చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌.. ఎప్పటి నుంచి అంటే?

మరిన్ని వార్తలు