కట్టె కాలేలోపు మరొకరు.. నిడమనూరుకు ఏమైంది?

28 Jun, 2022 21:01 IST|Sakshi
నంబూరి రమాదేవి, రఘురామ్, సునీత,  అభిరామ్‌ (ఫైల్‌) 

సాక్షి, నల్గొండ: అయితే హత్యలు.. లేదంటే ప్రమాదాలు.. మరీ కాదంటే అనారోగ్య సమస్యలు.. కారణాలు ఏమైతేనేం రోజు లేదా గంటల వ్యవధిలోనే ఇద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా పాత తాలూకా కేంద్రమైన నిడమనూరులో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి రోజు వ్యవధిలో మృతిచెందడంతో చర్చ తెరపైకి వచ్చింది. ఒకరి కట్టె కాలుతుందంటే చాలు రెండో వ్యక్తి ఎవరు? అని గ్రామస్తుల్లో వణుకు పుడుతోంది. నిడమనూరుకు ఏమైంది? అని గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 1990 దశకం నుంచి ఇప్పటి వరకు ఇదే తరహాలో పదుల సంఖ్యలో ఘటనలు చోటు చేసుకోవడం గ్రామస్తులను కలవరపెడుతోంది.

తాజాగా..
నిడమనూరు గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య, ఇదే గ్రామానికి చెందిన తన బంధువు సూరయ్యతో కలిసి హుజూర్‌నగర్‌లో బంధువులో ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు శుక్రవారం బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వీరి బైక్‌ను హుజూర్‌నగర్‌లోనే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లి లింగయ్య శనివారం మృతిచెందాడు. 

మరుసటి రోజు ప్రభుత్వ ఉద్యోగి..
పెద్దవూర : నిడమనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్‌ (50) కుటుంబంతో కలిసి హాలియాలో నివాసం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం నిడమనూరు సాయంత్రం ఇంటికి చేరుకున్న సయ్యద్‌ స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. పెద్దవూర మండలం తెప్పలమడుగు స్టేజి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.  

1990నుంచి మచ్చుకు కొన్ని ఘటనలు
► 1990లో అప్పటి సర్పంచ్‌ మేరెడ్డి వెంకటరెడ్డి,  కాంగ్రెస్‌ నాయకుడు ఉన్నం రామారావుల హత్యలు ఒకే రోజు గంటల వ్యవధిలో జరిగాయి.
► 1991లో మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ, మేరెడ్డి చలపతిరెడ్డిలు ఒకే రోజు మండలంలోని ముకుందాపురం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. 
► తదనంతరం  గ్రామానికి చెందిన గుండెమెడ స్వరాజ్యం, ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు(బాబ్జీ)లు సైతం ఒక రోజు తేడాతో అనారోగ్యంతో మృతిచెందారు.
► మండల కేంద్రానికే చెందిన పాల్వాయి నారాయణ ఆయన భార్య లలిత ఇంట్లో నిద్రిస్తుండగా వర్షానికి మిద్దె కూలి ఇద్దరూ నిద్రలోనే కన్నుమూశారు.
►  2018 జూలై 27న మండల కేంద్రానికి చెందిన నంబూరి రమాదేవితో పాటు ఆమె కుమారుడు రఘురామ్,  కూతురు సునీత, మనుమడు అభిరామ్‌లు అక్షరాభ్యాసం  చేయించేందుకు బాసరకు కా రులో బయలుదేరగా హైదరాబాద్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురూ మృతిచెందారు.  

మరిన్ని వార్తలు