ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు

28 Aug, 2023 06:39 IST|Sakshi

ఆ ఇరువురూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వారే

తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాకు చెందినవారే.

ఆది లాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బెదోడ్కర్‌ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్‌ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు.

పాఠశాల పేరు మీద యూట్యూబ్‌ చానల్‌లో పాఠాలు 
20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్‌ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా  గూగుల్‌ యాప్‌ ద్వారా  ఆన్‌లైన్‌లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్‌ చానల్‌లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్‌ లోడ్‌ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు.

సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది..
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. 

మరిన్ని వార్తలు