మేడ్చల్‌లో కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి వైన్స్‌ షాప్‌లో నగదు చోరీ

24 Jan, 2023 08:24 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: సినీ ఫక్కీలో మద్యం దుకాణం వద్ద రూ.2.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గుర్తు తెలియని ఆగంతుకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రిలోని వినాయక వైన్స్‌లో బాలకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్‌గా,  హెల్పర్‌గా జైపాల్‌రెడ్డి పని చేస్తున్నారు.

ప్రతిరోజు మాదిరిగానే సోమవారం సైతం మద్యం అమ్మగా వచ్చిన నగదు రూ.2.8 లక్షలు తీసుకుని రాత్రి 10.30 గంటలకు వైన్స్‌ షాపును మూసివేసి బయటకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు (25 నుంచి 30 ఏళ్ల వయసు) మంకీ క్యాపులు, కర్చీష్‌లు ధరించి బైక్‌పై వచ్చారు. పైసా దేవో అంటూ తుపాకితో బెదిరించారు. దీంతో వైన్స్‌ సిబ్బంది పక్కనే ఉన్న కర్రలతో వారిపై దాడి చేస్తుండగా.. దుండగులు తుపాకీతో బాలకృష్ణపై కాల్పులు జరపడంతో అతను తప్పించుకున్నాడు. తూటా వైన్స్‌ షెటర్‌కు తగిలి లోపల ఉన్న 5 మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి.

దుండగులు మరో రౌండ్‌ కాల్పులతో వైన్స్‌ సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.2.8 లక్షల నగదుతో పరారయ్యారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే దోపిడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి చివర మద్యం దుకాణం ఉండటంతో పాటు మెయిన్‌ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో పారిపోయేందుకు సులువుగా ఉంటుందని ఈ దుకాణాన్ని దుండగులు ఎంచుకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రామలింగరాజు తెలిపారు.   

చదవండి: Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్‌ వ్యాలీలో కరువైన నిఘా

మరిన్ని వార్తలు