వీసా అపాయింట్‌మెంట్ల పెంపునకు కృషి 

9 Sep, 2022 00:44 IST|Sakshi
రవి పులికి ప్రెసిడెంట్‌ వాలంటరీ అవార్డు’ను  అందిస్తున్న జెన్నిఫర్‌ 

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్‌మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లా ర్సన్‌ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్‌ఏ కాన్సుల్‌ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

జెన్నిఫర్‌ మాట్లాడుతూ.. అమెరికా, భారత్‌ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్‌ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్‌ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు.

2019లో కోవిడ్‌ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్‌ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్‌’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్‌ మినిస్టర్‌(ఎకనామిక్‌) డాక్టర్‌ రవి కోటతోపాటు యూఎస్‌ఐబీసీ, సీఐఐ, ఎఫ్‌ఐసీసీఐ, యూఎస్‌ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్, ఇండియన్‌ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు