దొరకని దీపిక ఆచూకీ.. పేరెంట్స్‌లో టెన్షన్

29 Sep, 2020 11:19 IST|Sakshi

వివాహిత కిడ్నాప్‌ కేసులో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు

వికారాబాద్‌ : పట్టణంలో సినీ ఫక్కీలో వివాహితను కిడ్నాప్‌ చేసిన ఘటనలో పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు. పట్టణానికి చెందిన దీపిక ఆదివారం సాయంత్రం తన అక్కతో కలిసి ఆలంపల్లి రోడ్డులో షాపింగ్‌ చేసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో దుండగులు వాహనంలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. అనంతరం వికారాబాద్‌ బీజేఆర్‌ చౌరస్తా వైపు నుంచి పరారయ్యారు. కాగా దీపిక 2016లో ఆర్యసమాజ్‌లో అఖిల్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నేళ్లుగా తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. భర్తే ఆమెను కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ, ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా గాలిస్తున్నారు. ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు డీఎస్పీ సంజీవరావు ఎప్పటికప్పుడు కేసు వివరాలు ఆరా తీస్తున్నారు. (దీపిక కిడ్నాప్‌ కేసు: పెళ్లైన విషయం తెలీదు)

మరోవైపు కుటుంబ సభ్యుల ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో పెళ్లి చేసుకున్నా.. దీపిక, అఖిల్‌ నెల రోజులు కూడా కలిసి ఉండలేకపోయారని తెలిసింది. దీపికకు ఇష్టముంటే ఇంత కిడ్నాప్ డ్రామా అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న దీపిక ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని పోలుసులునిర్ధారించారు. అఖిల్‌ స్నేహితుల ద్వారా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీపిక కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అఖిల్ బంధువులు, స్నేహితులను విచారిస్తున్నారు. అయితే వికారాబాద్‌లో పలుచోట్లు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారు ప్రయణించిన కారు ఎటువైపు వెళ్లిందో కనిపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. అయితే దీపిక ఎక్కడ ఉన్నది అనేది మాత్రం పోలీసులు బయటకి చెప్పడం లేదు. భర్త వద్దే దీపికా ఉందని అనుమానం వ్యక్తం చేస్తు న్నామని త్వరలో కేసు ఛేదిస్తాం అంటున్నారు. ఇక ఈ కిడ్నాప్‌ కేసు చివరికి  ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.


 

మరిన్ని వార్తలు