యుద్ధభూమిలో ఉన్నాం... నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పు

4 Mar, 2022 07:21 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: ‘ఉక్రెయిన్‌ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొందరు భార తీయ విద్యార్థులు  నిబంధనలకు అతిక్రమించి బంకర్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధగా ఉంది’ అని ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న లీదియా జురావ్‌వోలా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, చెన్నైలలో చదువుకున్న ఆమె భారతీయ సంస్కృతి, కళల పట్ల  మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ వంటి నృత్యాలను నేర్చుకున్నారు. లీదియా ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కర్ణాటక విద్యార్థి నగరంలోని ఫ్రీడమ్‌ స్క్వేర్‌ భవనం వద్ద బాంబు దాడిలో మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. 

ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు.. 
రష్యన్‌ బలగాలు ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో తెలియదు. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్‌ ప్రభుత్వం, ఇండియన్‌ ఎంబసీ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్ల మీదకు వస్తున్నారు. ఏజెంట్లను నమ్మి సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా బంకర్లలోనే ఉండాలి. ప్రతి విదేశీ విద్యార్థి పట్ల ఉక్రెయిన్‌ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మా వలంటీర్లు బంకర్ల వద్దకు వెళ్లి ఆహారం, మందులు ఇస్తున్నారు.

 ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందే ఫిబ్రవరి 15న భారత  ప్రభుత్వం తమ వాళ్లను స్వదేశానికి రావాలని సూచించింది. కానీ చాలా మంది విద్యార్థులు ఫిబ్రవరి 24 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరకు అంతర్జాతీయ రాకపోకలు స్తంభించడంతో  చిక్కుల్లో పడ్డారు. స్థానిక రేడియోలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరైనా సరే కర్ఫ్యూ సడలించినప్పుడే బంకర్ల నుంచి బయటకు రావాలి. ఉక్రెయిన్‌లో 180 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు. వారికి బంకర్లే సురక్షిత స్థావరాలు. ఆయా దేశాల ఎంబసీలు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా అక్కడే  ఉండాలి.   

భారతీయ సంస్కృతిపై ప్రేమతో..
వినితియా నగరానికి చెందిన లీదియాను చిన్నప్పటి నుంచే విషాదం వెంటాడుతోంది. చెర్నోబిల్‌ అణు ధార్మికత ప్రభావంతో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. నాలుగుసార్లు సర్జరీలు జరిగాయి. కానీ యోగ, ధ్యానం, ప్రాణాయామంతో ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 2014లో జరిగిన యుద్ధంలో ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోయారు. అంతకుముందే 2011లోనే ఆమె భారత్‌కు వచ్చారు. నాట్యశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ‘బెల్‌ నాట్యం కథా కల్పం’ అనే నూతన నృత్యరీతిని పరిచయం చేశారు.  ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఆ కోణంలోనే తన పేరులో చివరకు ‘లక్ష్మి’ వచ్చేలా పెట్టుకున్నట్లు లీదియా జురావ్‌వోలా లక్ష్మి పేర్కొన్నారు. 

అత్యవసర సేవల్లో లీదియా.. 
ఆపదలో ఉన్న వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను అందుకొని  అవసరమైన సహాయ సహకారాలను అందజేసే విధి నిర్వహణలో లీదియా ఉన్నారు. ఉక్రెయిన్‌ లోని ఏ మూల నుంచైనా ఇలాంటి అత్యవసర ఫోన్‌కాల్స్‌ రావచ్చు. వెంటనే వలంటీర్లను అక్కడికి తరలిస్తారు. లీదియాకు మాతృభాష ఉక్రెయిన్‌తో పాటు రష్యన్‌ భాష కూడా తెలుసు. అందుకే ఎస్‌ఓఎస్‌ విధులు అప్పగించారు. విభిన్న రంగాలకు చెందిన మేమంతా ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నాం. సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు అందరం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాం.మాకు ప్రపంచం మద్దతు కావాలి అని ఆమె చెప్పారు.   

(చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం)

మరిన్ని వార్తలు