World Vegan Day: మాంసాహారం ముట్టబోమని ఒట్టుపెట్టుకున్న బాలీవుడ్‌ స్టార్స్‌ ఎవరో తెలుసా?

1 Nov, 2021 13:47 IST|Sakshi

‘ఒక దేశం గొప్పతనం, నైతిక ప్రగతి... ఆ దేశం జంతువుల పట్ల వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది’ అంటారు మహాత్మాగాంధీ! అట్లా జంతువుల మీద  ప్రేమ కొంత, సొంత ఆరోగ్యంపట్ల శ్రద్ధ మరికొంత... మొత్తంగా వేగనిజం మీద ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వేగన్స్‌గా మారిపోతున్నారు. నేడు (సోమవారం) వరల్డ్‌ వేగన్‌ డే సందర్భంగా ‘వేగనిజం’ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!   

వేగన్స్‌ అంటే? 
మాంసాహారం మాత్రమే మానేసినవాళ్లు శాకాహారులు. కానీ జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగువంటి ఉత్పత్తులను కూడా తీసుకోకుండా, కేవలం మొక్కలు, ఆకుల మీద ఆధారపడి బతికేవారు వేగన్స్‌. జంతువుల హక్కుల న్యాయవాది డోనాల్డ్‌ వాట్సన్‌ వెజిటేరియన్‌ అనే పదం నుంచి వేగన్‌ను సృష్టించాడు. 1944లో ‘ది వేగన్‌ సొసైటీ’ని స్థాపించాడు. ఆ వేగన్‌ సొసైటీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1994 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 1న వరల్డ్‌ వేగన్‌ డే నిర్వహిస్తున్నారు. నవంబర్‌ నెలను వేగన్‌ మంత్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.  

పోషకాల కొరతేం లేదు..
వేగన్‌గా మారతాం సరే... శరీరానికి పోషకాలు అందేదెలా? ప్రోటీన్‌ మాటేమిటి? చాలా మంది  ప్రశ్న. కానీ శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ ఆకుకూరలు, కూరగాయల్లో దొరుకుతాయంటారు వేగన్స్‌. మాంసాహారం, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నవారికి .. టోఫు, బాదం పాలు, సోయాపాలు, కొబ్బరిపాలు, బియ్యంపాలు వంటివాటిని ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. ఛీజ్, మయోనీజ్‌ సైతం... పాలు, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చట. 

ప్రత్యామ్నాయంగా శాకాహార మాంసం! 
ముక్కలేనిదే ముద్దదిగని వాళ్లు కొంతమంది ఉంటారు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరకంగా మాంసాహారం ఊరిస్తూనే ఉంటుంది. మాంసాహారం తినేటప్పుడు ఎక్కువ నములుతాం. నోటి నిండా ఎక్కువ సమయం పదార్థ్ధాన్ని ఫీల్‌ అవుతాం. మాంసాహారం పంటికి సరిపోయే బైట్‌  స్ట్రెంత్‌ కలిగి ఉంటుంది. శాకాహారంతో అది ఉండదు. చాలామంది నాన్‌వెజ్‌ వదలకపోవడానికి కారణమిదే.

కానీ... ఇలాంటివారికోసం మొక్కల నుంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందట. అదే వెజ్‌ మీట్‌. మాంసం టెక్చర్‌తోపాటు... పంటికి మాంసం తిన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. మొక్కల నుంచి వచ్చే మాంసందే భవిష్యత్‌ అని చెబుతున్నది... ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న నటి జెనీలియా. వీటితో సీక్‌ కబాబ్, చికెన్‌ నగ్గెట్, బిర్యానీ, బర్గర్‌పాటీస్, సాసేజెస్‌ వంటివి చేసుకోవచ్చట.  

లాభాలెన్నో..  
వేగన్స్‌గా మారడం వల్ల జంతువులను రక్షించినవాళ్లమే కాక... పర్యావరణాన్ని పరిరక్షించినవాళ్ల మవుతామంటున్నారు. వేగన్‌గా మారడం వల్ల 15 రకాల ప్రాణహాని కారక వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆహారంలో కొలెస్ట్రాల్‌ తక్కువ, ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, టైప్‌ టు డయాబెటిస్, క్యాన్సర్స్, ఆర్థ్రరైటిస్, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులేవీ దరిచేరవంటున్నారు. బరువు పెరగరు, మానసిక ఆరోగ్యానికి సైతం ఇదే మందంటున్నారు.  


సెలబ్రిటీస్‌తో పాపులారిటీ...  
ఏటా వేగనిజం పాపులారిటీ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ చాలామంది సెలబ్రిటీస్‌ ఇప్పుడు వేగన్స్‌గా మారిపోయారు. బాలీవుడ్‌ స్టార్స్‌ ఆమిర్‌ఖాన్, జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్, సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ,  శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, వంటి మాంసాహారం ముట్టబోమని ఒట్టు పెట్టుకున్నారు.  

►ప్రపంచ జనాభాలో 5శాతం శాఖాహారులు. అందులో సగం వేగన్స్‌.నో మీట్‌ పాలసీలో భాగంగా 2012 నుంచి లాస్‌ ఏంజిల్స్‌లో ప్రతి సోమవారం మాంసాహారం విక్రయించరు. 2020లో కేఎఫ్‌సీ మొట్టమొదటి వేగన్‌ బర్గర్‌ను తయారు చేసింది.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు