మహిళలే వైఎస్సార్‌సీపీ బలం.. బలగం

27 Mar, 2023 01:32 IST|Sakshi
సమావేశానికి భారీగా హాజరైన మహిళలు

నగరి : మహిళలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం బలగం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ భారీ బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరి మునిసిపల్‌, మండల పరిధిలో లబ్ధిదారులైన 14,468 మంది మహిళలకు రూ.15.51 కోట్ల చెక్కును ఆమె అందజేశారు. తోబుట్టువులా తమను ఆదుకుంటున్నారంటూ మహిళలు మంత్రితో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్‌ కట్‌చేసి మంత్రికి తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తకంగా 78.94 లక్షల మంది మహిళలకు ఆసరా 3వ విడత ద్వారా రూ. 6419.89 కోట్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. నగరి నియోజకవర్గ పరిధిలో 44,750 మందికి రూ.46.3 కోట్లు ఆసరా 3వ విడతలో అందిస్తున్నట్లు వివరించారు. ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, చేయూత, జగనన్నతోడు, బ్యాంకు లింకేజి, జగనన్న ఇళ్లు పథకాలతో మహిళలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఒక్క నగరి మున్సిపాలిటీలోనే ఇప్పటి వరకు ఈ పథకాల ద్వారా 55,236 మంది మహిళలకు రూ.187.56 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. మహిళలు గత పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుకే ఎన్నికల సమయంలో మభ్యపెట్టడానికి పసుపుకుంకుమ ఇచ్చిన చంద్రబాబుకు మహిళలు ఉప్పు, కారం పెట్టి సాగనంపారని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి పథకం మహిళల పేరిటే అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా మహిళలకు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మహిళా ముఖ్యమంత్రులు పాలించే రాష్ట్రాల్లోనే మహిళలకు ఇంతటి ప్రాధాన్యత లేదన్నారు. అందుకే నేడు ప్రతి మహిళా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అన్నదమ్ముడిలా, కొడుకులా, మనవడిలా తన గుండెల్లో పెట్టుకుంటున్నట్లు చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి తమను పాలిస్తున్నాడని, తాను మంచి వ్యక్తికి ఓటు వేశానని ప్రతి మహిళ నేడు గర్వపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుజన, మెప్మా పీడీ రాధమ్మ, మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్‌ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవో చంద్రమౌళి, మునిసిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, ఎంపీపీ భార్గవి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మాహిన్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ వెంకటరత్నం, వైస్‌ ఎంపీపీ కన్నియప్ప, మెప్మా అధికారి సునీత, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుమలరెడ్డి, కౌన్సిలర్లు, కో–ఆప్షన్‌ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

జనం గుండెల్లో జగనన్న ఉన్నారు

పర్యాటక శాఖ మంత్రి ఆర్కేరోజా

14,468 మందికి రూ.15.51 కోట్ల వైఎస్సార్‌ ఆసరా చెక్కు పంపిణీ

మరిన్ని వార్తలు