రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు

11 Nov, 2023 07:40 IST|Sakshi

సచివాలయాల సహాయకుల నియామకాలంటూ అసత్య కథనాలు

కోట్లు దండుకుంటున్నారని తప్పుడు రాతలు

ఈనాడు వార్తను ఖండించిన జీవీఎంసీ అధికారులు

విశాఖపట్నం: లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు సృష్టిస్తోంది. వార్డు సచివాలయాలకు సహాయకుల నియామకాలు.. అందుకు రూ.3 లక్షల చొప్పున వసూళ్లు.. గుంటూరు కేంద్రంగా ఓ కన్సల్టెన్సీ ద్వారా చేపడుతున్న ప్రక్రియతో జీవీఎంసీపై రూ.10.4 కోట్ల భారం అంటూ లేని వార్తను ఈనాడు వండి వార్చింది. సచివాలయాలకు గతంలో జరిగిన నియామకాలు తప్పితే.. ప్రస్తుతం ఎటువంటి పోస్టుల భర్తీ లేదు. అయినప్పటికీ గాలి వార్తలు రాస్తూ.. లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై కట్టు కథలు అల్లి.. బురద జల్లుతోంది.

లేని పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా.. వాటిని వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు అమ్ముకుంటున్నట్లుగా ఓ అవాస్తవ కథనాన్ని అచ్చేసింది. వాస్తవానికి 2019, 2020లో మినహా ఇప్పటి వరకు వార్డు సచివాలయాలకు సంబంధించి ఎటువంటి నియామక ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం ప్రతీ సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించే అవకాశం లేదు. అయినప్పటికీ సహాయకుల నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు ఈనాడు తప్పుడు కథానాన్ని అల్లేసింది. ఈ వార్తను జీవీఎంసీ ఉన్నతాధికారులు ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

వాస్తవం ఇలా..
జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 2019, 2020లో సచివాలయ కార్యదర్శుల నియామకాలు జరిగాయి. అలాగే ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా గౌరవ వేతనంపై వార్డు వలంటీర్లను నియమించారు. మరే ఇతర సిబ్బందిని ఏ ప్రాతిపాదికపైనా కూడా జీవీఎంసీ నియామకాలు చేపట్టలేదు. ప్రస్తుతం చేపట్టే అవకాశం కూడా లేదని జీవీఎంసీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఈనాడులో ప్రచు రించిన విధంగా ఎటువంటి సహాయకుల నియామకాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

ఇక ఆప్కాస్‌ విషయానికొస్తే..
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆప్కాస్‌ను ప్రారంభించింది. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను విలీనం చేసిన నాటి నుంచి 2022 డిసెంబర్‌ నాటికి 482 అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని ఆప్కాస్‌ నియమావళి ఆధారంగా రోస్టర్‌ పాయింట్‌/రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పద్ధతిలో జీవీఎంసీ కౌన్సిల్‌, కలెక్టర్‌, ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులను నియమించి ఉపాధి కల్పిస్తున్నారు.

ఇటీవల కాలంలో విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగు కోసం తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ వేతనంపై జీవీఎంసీ కౌన్సిల్‌, స్థాయీ సంఘం ఆమోదంతో స్థానిక మహిళా సహాయ సహకార సంఘాల ద్వారా అదనపు కార్మికులను నియమించుకున్నట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తాత్కాలికంగా నియమించిన వీరిని.. పారిశుధ్య పనులు పూర్తయిన వెంటనే నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు