ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్‌

11 Oct, 2023 07:46 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ పవార్‌

వనపర్తి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ తేజస్‌ పవార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, సర్వేలెన్స్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సూచనలు చేశారు.

జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సర్వేలెన్స్‌ బృందాల బాధ్యతలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని, జిల్లా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిఘా పెంచినట్లు తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బహుమతులు ఇవ్వడం లాంటివి నియంత్రించాలని ఆదేశించారు.

సి–విజిల్‌ యాప్‌తో గాని టోల్‌ఫీ నంబర్‌ 1950, కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకునేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని.. స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌ చురుగ్గా పని చేయాలని సూచించారు. రూ.50 వేల కన్నా అధికంగా పట్టుబడితే వెంటనే సీజ్‌ చేయాలన్నారు.

రూ.10 లక్షల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్‌ చేయబోమని.. ఇన్‌కం టాక్స్‌ వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ విలువ గల వస్తువులు గుర్తిస్తే వీడియో కవరేజ్‌ చేస్తూ సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు