ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు తనిఖీ

18 Nov, 2023 01:14 IST|Sakshi

మదనాపురం: మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌ మిశ్రా తనిఖీ చేశారు. అంతకుముందు మండలంలోని దంతనూరు సమీపంలో ఉన్న ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కూలీలతో మాట్లాడారు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ అబ్రహం లింకన్‌ తదితరులు ఉన్నారు.

ప్రలోభాలకు గురికావొద్దు

పెబ్బేరు రూరల్‌: యువ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన అభ్యర్థికే ఓటు వేయాలని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి రాం మహేశ్వర్‌రెడ్డి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ పవార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ, వీరభద్ర డిగ్రీ కళాశాలలో ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ‘ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నేను నా ఓటును తప్పకుండా వినియోగించుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి కంటే దేశం చాలా గొప్పదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. డీపీఆర్‌ఓ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, పౌరుల హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రదీప్‌, వినోద్‌కుమార్‌, మిషన్‌శక్తి విభాగానికి చెందిన కౌన్సిలర్‌ శ్రీవాణి, సుమ, ఎఫ్‌ఆర్‌ఓ పవన్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హస్తం గూటికి

మందా జగన్నాథం

అలంపూర్‌: ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్‌ అలంపూర్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ మందా శ్రీనాథ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సంపత్‌కుమార్‌తో కలిసి మందా జగన్నాథం, మందా శ్రీనినాథ్‌లు శుక్రవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు