రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి

18 Nov, 2023 01:14 IST|Sakshi

అలంపూర్‌/ నాగర్‌కర్నూల్‌ రూరల్‌: పొలాల్లో పంట మార్పిడి ఎలా చేస్తారో.. అలాగే రాజకీయాల్లోనూ అధికార మార్పిడి జరగాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా అయిజలో మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థులు ఎవరూ శ్రీమంతులు కారని, కష్టార్జితాన్ని నమ్ముకొనే మీ ముందుకు వచ్చారన్నారు. వాళ్ల వలే ఓటుకు వెయ్యి ఇచ్చి, 90 ఎంఎల్‌ బాటిల్‌, ఇంటి వద్ద ఉచితంగా భోజనాలు పెట్టే వాళ్లు కాదన్నారు. కానీ, ఐదేళ్లు రోజుకు మూడు పూటల తిండిపెట్టే విధంగా మీ అందరినీ తయారు చేయడానికి వచ్చిన వారన్నారు. వాల్మీకులు, కుర్వ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఎంత మందికి టికెట్‌ ఇచ్చిందని ప్రశ్నించారు. బీఎస్పీ మహబూబ్‌నగర్‌, వనపర్తిలో వాల్మీకులకు టికెట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ పెంచి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ అలంపూర్‌ గడ్డలో పుట్టిన.. ఇదే తుంగభద్ర నీళ్లు తాగిన.. ఇదే నడిగడ్డ గాలి పీల్చిన.. ఇదే నడిగడ్డలో మొలకెత్తిన విత్తనాలు తిని పెరిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. అలంపూర్‌, సిర్పూర్‌ బీఎస్పీకి రెండు కళ్లలాంటివని, తప్పకుండా రెండు చోట్ల గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

అయిజ, నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభలు

మరిన్ని వార్తలు