బడా నాయకుల్ని వెంట బెట్టుకుని రాజకీయం చేస్తున్నారు..

25 May, 2023 12:06 IST|Sakshi

పశ్చిమ గోదావరి: గోపాలపురం నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు వ్యవహార శైలి, ఒంటెద్దు పోకడను వ్యతిరేకిస్తూ మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ, కప్పలకుంటలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంకురాత్రి శ్రీను, ఆయన సోదరుడు సంకురాత్రి రాంబాబు ఇంటి సమీపంలోని తోటలో మంగళవారం రాత్రి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మద్దిపాటి వెంకట్రాజు తీరుపై ధ్వజమెత్తారు.

నియోజకవర్గంలో కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులను చేశారని, కులచిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతనినే ఇన్‌చార్జిగా ప్రకటించడం దారుణమన్నారు. నాయకులందరూ నిర్ణయించాల్సిన మండల అధ్యక్ష పదవిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారని, ఇది టీడీపీ సంప్రదాయం కాదన్నారు.

డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఈనెల 27న రాజమండ్రిలో జరిగే మహానాడు తరువాత మళ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్‌చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. నాయకులను పార్టీ పట్టించుకోవడం లేదని, ఇన్చార్జి నియామకం విషయంలో నాయకులందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి తెలిపి పార్టీ పరిగణలోకి తీసుకుంటే కష్టపడి పనిచేయాలని, లేకుంటే ఆరోజే తగు నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు