Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

Published Sun, Nov 12 2023 1:46 AM

సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్న డీఐజీ అశోక్‌కుమార్‌   - Sakshi

ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఏలూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. నగరంలోని ముఖ్య కూడళ్లలోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించారు. నగర మ్యాప్‌ను చూపిస్తూ వీటి పనితీరును ట్రాఫిక్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌ డీఐజీకి వివరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ ఏలూరులో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరిన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.

టూటౌన్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అశోక్‌కుమార్‌ తనిఖీ చేశారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టులు, చార్జిషీట్లు వంటి వాటిపై ఆరా తీశారు. కీలక కేసులను గుర్తించి సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్షలు పడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, స్టేషన్‌ కేసు డైరీ, విలేజ్‌ రోస్టర్‌, క్రైమ్‌ రికార్డ్స్‌, సీజ్‌చేసిన వాహనాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. మద్యం, గంజాయి అక్రమ రవాణా, పేకాట, క్రికెట్‌ బెట్టింగులు వంటి అసాంఘిక చర్యలపై నిఘా మరింత పెంచాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, జూదంపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచాలని, నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, టూటౌన్‌ సీఐ పీ.చంద్రశేఖర్‌, ఎస్సై సాధిక్‌, శుభశేఖర్‌ ఆయన వెంట ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement