ట్విటర్‌లో సరికొత్త ఫీచర్‌, ఉచితం మాత్రం కాదండోయ్‌!

21 Mar, 2021 11:31 IST|Sakshi

వాషింగ్టన్‌: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ట్విటర్‌‌ తమ ఫ్లాట్‌ఫాంపై మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రాబోతున్న ఈ ఫీచర్‌లో మన టీట్లకు సవరణలు, డిలీట్‌ చేసేలా ‘అన్‌ డూ’ ఆప్షన్‌ ఉంటుంది. అయితే ఇది గతంలో మాదిరిగా ఉచితం కాదండోయ్‌! సబ్‌స్క్రైబ్‌‌ చేసుకుంటే తప్ప ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదు. దీంతో ఇప్పుడు ట్విటర్‌ వాడుతున్న వారంతా భవిష్యత్తులో ఈ ఫీచర్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యూజర్ల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్‌ ఈ ‘అన్‌డూ’ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత స్మార్ట్‌ యుగంలో ఓ ఫీచర్‌ను ఉచితంగా కాకుండా సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులోకి తీసుకురావాలనే ట్విట్టర్‌ సంస్థ ఆలోచన సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. మార్చి 5న ఇంజనీరింగ్ నిపుణుడు, జేన్ మంచంగ్ వాంగ్, మాట్లాడుతూ ట్విట్టర్లో అన్‌డూ ఫీచర్‌కి అవకాశం ఉన్నందున త్వరలోనే ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

‘'ట్వీట్ అన్‌ డూ' ఫీచర్‌ టైమర్ కలిగి ఉంటుంది, అంటే జీమెయిల్‌  అన్‌సెండ్ మెయిల్‌  ఫీచర్ లాగా పనిచేస్తుంది. అనగా యూజర్లకు పరిమిత సమయంలోనే తాము పంపిన ట్వీట్‌ అన్‌సెండ్, ఎడిట్‌  చేయడానికి వీలుంటుంది. ఎందుకోగానీ  మిగతా ఫీచర్లలా దీన్ని ఉచితంగా అందించేందుకు మాత్రం ట్విట్టర్ సిద్ధంగా లేదు. ప్రత్యేకంగా సబ్‌ స్కైబ్‌  చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వాలని ట్విట్టర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్‌స్క్రైబ్‌‌ చేసుకున్న తర్వాత యాప్‌లో యూజర్లకు అన్ ‌డూ బటన్ దర్శనమిస్తుంది. సాధారణంగా యూజర్‌ తాను ట్వీట్‌ చేసిన వెంటనే తప్పిదాన్ని గుర్తించి దాన్ని వెనక్కి తీసుకునేందుకు లేదా తొలగించేందుకు అన్‌ డూ బటన్‌ నొక్కాల్సి ఉంటుంది. అలా చేస్తే వెంటనే ఆ ట్వీట్‌ ఉపసంహరించవచ్చు. ఈ రకంగా అన్‌ డూ ఉపయోగపడుతుంది’ అని మంచంగ్ వాంగ్ పేర్కొన్నారు.
చదవండి: తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

మరిన్ని వార్తలు