ప్రేమ వివాహం..విడాకులు..మళ్లీ పెళ్లి..

4 Jun, 2019 09:30 IST|Sakshi

అహ్మదాబాద్‌ : తల్లితండ్రుల ఒత్తిడితో వేరొకరిని పెళ్లి చేసుకున్న తన భార్యను తిరిగి తన వద్దకు పంపాలని కోరుతూ 29 ఏళ్ల వ్యక్తి గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఇటీవలే వివాహం జరిగిందని, తనకు విడాకులు ఇవ్వకుండానే తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుందని పిటిషనర్‌ ఆరోపించారు. కాగా యువతి తల్లితండ్రుల నుంచి బెదిరింపులు వస్తున్న క్రమంలో తమకు పోలీసు భద్రత కావాలని గతంలో ఈ జంట కోర్టును ఆశ్రయించగా మే 1న వారికి భద్రత కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పటాన్‌కు చెందిన పిటిషనర్‌ తన భార్య (24)ను తిరిగి తన వద్దకు పంపేలా ఆదేశించాలని న్యాయస్ధానానికి నివేదించారు.

కేసు వివరాల ప్రకారం.. యువతి తల్లితండ్రుల అభిమతానికి వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి 17న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అప్పటినుంచి యువతి తల్లితండ్రుల నుంచి బెదిరింపులు ఎదురవడంతో ఏప్రిల్‌ 29న వారు పోలీసు భద్రతను కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి మే 1 నుంచి భద్రత కల్పించాలని తక్షణమే ఆదేశాలు జారీ చేసింది. అయితే మే 10న యువతి తల్లితండ్రులు ఆమెను బలవంతంగా పిటిషనర్‌ నుంచి వేరుచేసి తీసుకువెళ్లారు. తన భార్యను ఆమె పుట్టింటి వారు బలవంతంగా తీసుకువెళ్లారని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిర్లక్ష్యం చూపారని ఆరోపణలు వచ్చాయి.

మే 27న మరోసారి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. పోలీసులు సవ్యంగా విచారణ చేపట్టకుండా మే 25వ తేదీతో ఉన్న లేఖను తనకు ఇచ్చారని చెప్పారు. లేఖలో తనకు గతంలో పిటిషనర్‌తో ప్రేమ వివాహం జరిగిందని, ఆయనతో విడాకులు తీసుకుని తల్లితండ్రుల సమ్మతితో మరొకరిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. తాను ఎలాంటి ఒత్తడిలో ఈ నిర్ణయం తీసుకోలేదని, తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొంది. పిటిషనర్‌ వాదనలు పూర్తి అవాస్తవమని, నిరాధారమని కూడా ఈ లేఖలో యువతి పేర్కొంది. కాగా, పోలీసుల నివేదికను పరిశీలించాలని, యువతి విడాకులు పొంది తిరిగి వివాహం చేసుకుందా అనేది నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 13కు హైకోర్టు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు