దోషులను అరెస్ట్‌ చేయాలి

3 Feb, 2018 18:15 IST|Sakshi
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కైలాస్‌బాబు

మర్తిడి ఘటనపై దళిత సంఘాల డిమాండ్‌

కాగజ్‌నగర్‌లో ప్లకార్డులతో ప్రదర్శన

డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడి

కాగజ్‌నగర్‌/బెజ్జూర్‌ : బెజ్జూర్‌ మండలం మర్తిడి గ్రామానికి చెందిన దళిత మహిళ దుర్గం సేవంతకు నిప్పు పెట్టి సజీవదహనం చేసిన దోషులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు, టీ మాస్‌ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు, ఉపాధ్యక్షుడు కూశన రాజన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం బెజ్జూర్‌ మండలంలోని మర్తిడి గ్రామానికి వెళ్లి మృతురాలు సేవంతబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో దోషులను శిక్షించాలని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత మహిళను అతికిరాతకంగా చంపిన నాయకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వారం క్రితం సేవంతాబాయి ఇంటిని తగలపెట్టిన దుండగులపై మృతురాలు బెజ్జూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇళ్లు తగలపెట్టినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. మృతిరాలి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్‌ కుమార్, బవండ్లపల్లి నర్సయ్య, అల్లూరి లోకేశ్, కార్తిక్, జాడి మల్లయ్య ఆర్‌.తిమ్మారావు, దినకర్‌ పాల్గొన్నారు.

‘అధికారుల నిర్లక్ష్యంతోనే     దారుణం’
వాంకిడి(ఆసిఫాబాద్‌): దళిత మహిళపై కిరోషిన్‌ పోసి అతికిరాతకంగా హతమార్చిన సంఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌మోహార్కర్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బెజ్జుర్‌ మండలం మర్తిడిలో దళిత మహిళపై దాడికిపాల్పడడం, ఇళ్లు తగలపెట్టడం సంఘటనలు జరిగిన అధికారులు స్పందించలేదన్నారు. దోషులను శిక్షించి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో దళిత సంఘం నాయకులు విలాస్‌ ఖోబ్రాగడె, విటల్, రోషన్, పాండుజీ, దుర్గాజీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు గణేశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు