రక్తమోడుతున్న రహదారులు 

13 Jun, 2019 11:07 IST|Sakshi

జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు 

గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు 

నూతన ఎస్పీ దృష్టి సారిస్తే యాక్సిడెంట్లు తగ్గేనా..? 

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ఈ నెల 10న ఎస్కేయూ సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఐచర్‌ వాహనం ఢీకొన్న ఘటనలో పూలకుంటకు చెందిన తండ్రీకొడుకు మృతి చెందారు. పాఠశాలలో అడ్మిషన్‌ కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నార్పల మండలం మద్దలపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. తాడిపత్రి నుంచి అనంతపురానికి బొగ్గు పొడితో వెళ్తున్న లారీ మద్దలపల్లి వద్దకు రాగానే టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో పక్కనే వస్తున్న ద్విచక్రవాహనంపైకి లారీ పడింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు, లారీ డ్రైవర్, క్లీనర్‌ ప్రాణాలు కోల్పోయారు.


జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా సగటున జిల్లాలో 600 మందికిపైగా మృతి చెందుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా ఆచరణలో నిలువరించలేకపోతున్నారు. అతివేగం, అధికలోడు, రోడ్డు నిబంధనలపై అవగాహనలేమి ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బూసారపు సత్య యేసుబాబు రోడ్డు ప్రమాదాల నివారణ తన ప్రాధాన్యత అంశంగా ప్రకటించారు. కొరవడుతున్నఅవగాహన రోడ్డు ప్రమాదాల నిలువరించడంలో పోలీసులు, రోడ్డు రవాణాశాఖ అధికారులు కొన్నేళ్లుగా విఫలమవుతూనే ఉన్నారు. రోడ్డు భవనాలశాఖ, నేషనల్‌హైవే ఇంజినీర్ల లోపాలు కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. సుదీర్ఘ వైశాల్యమున్న జిల్లాలో  మూడు జాతీయ రహదారులు, మూడు రాష్ట్రీయ రహదారులు, పలు గ్రామీణ రోడ్లు ఉన్నాయి. వందల కిలోమీటర్ల పొడువున అనేక పట్టణాలు, గ్రామాలను కలుపుకొని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అత్యంత పొడవైన జాతీయ రహదారి 44 జిల్లాలో గుత్తి నుంచి పెనుకొండ వరకు వెళ్తోంది. ఈ రహదారుల గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే రోడ్డు నిర్మాణాల్లో లోపాలు, రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం తదితర కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రముఖులను సైతం రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకున్నాయి.


రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వేగ నియంత్రణ చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  కనీసం 100 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఆ మేరకు రోడ్డు నిబంధనలపై అవగాహన ప్రజల్లో కొరవడింది. రోడ్డు ప్రమాదాల రూపంలో సగటున 600 మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 1500 మంది పైచిలుకు మంది వికలాంగులుగా తయారవుతున్నారు. ఈ లెక్కలు పోలీసుశాఖ అధికారులు అధికారికంగా చెబుతున్నవే. గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలా మటుకు పరిగణలోకి రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే బాధిత కుటుంబాలు ఎంత క్షోభను అనుభవిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.  

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం 
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. నాయనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం టైర్లు పేలడం వలన జరిగింది. కానీ అధిక లోడు కూడా కారణంగా తెలుస్తోంది. తాడిపత్రి నుంచి ఎక్కడికి వెళ్తోంది.. ఎన్ని లారీలు వెళ్తున్నాయి.. తదితర అంశాలను అరా తీస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అతివేగం, అధికలోడు, సీటుబెల్టు, హెల్మెట్, తాగి వాహనాలు నడపడం తదితర అంశాలపై పోలీసుల ఫోకస్‌ ఉంటుంది.             – సత్య యేసుబాబు, ఎస్పీ  

మరిన్ని వార్తలు